అత్యవసరమా ? డయల్‌ 100కి 📞 కాల్ చేయండి…


అలాంటి పరిస్థితి మనకొద్దు: సీఎం కేసీఆర్‌

రాష్ట్రంలో ఇప్పటి వరకు 36 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని సీఎం కేసీఆర్‌ తెలిపారు. వీరిలో ఒకరు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారని చెప్పారు. మరో 114 మంది కరోనా అనుమానిత లక్షణాలతో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ప్రగతిభవన్‌లో అత్యున్నత స్థాయి సమీక్ష, జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఆర్మీని రంగంలోకి దించారని చెప్పారు. రాష్ట్రంలో ఆర్మీని రంగంలోకి దించడం, 24 గంటల కర్ఫ్యూ, కనిపిస్తే కాల్చివేతలాంటి ఉత్తర్వులు అవసరమా? అని ప్రశ్నించారు. అలాంటి పరిస్థితి తీసుకురావొద్దని.. ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించి కరోనా వైరస్‌ నిరోధానికి కట్టుబడి ఉండాలని కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.

ప్రజా ప్రతినిధులు ఏమయ్యారు?లాక్‌డౌన్‌ సమయంలో కేవలం పోలీసులు, అధికారులు మాత్రమే కనిపిస్తున్నారని.. ప్రజాప్రతినిధులంతా ఏమయ్యారని కేసీఆర్‌ సూటిగా ప్రశ్నించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లు, జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలు సహా అందరూ వారి పరిధిలోని నియోజకవర్గ కేంద్రాల్లోనే ఉంటూ కరోనా నియంత్రణకు కట్టుబడాలని ఆదేశించారు. ‘‘ఏ ఊరి సర్పంచ్‌, ఎంపీటీసీలు ఆ ఊరికి కథానాయకుడు కావాలి. ప్రజాప్రతినిధులందరూ వారి పరిధుల్లోని ప్రాంతాల్లో రంగంలోకి దిగాలి. రాష్ట్ర సరిహద్దుల వద్ద నిలిచిపోయిన వాహనాలకు టోల్‌ మినహాయింపు ఇస్తున్నాం. వారంతా ఈరాత్రిలోపు గమ్యస్థానాలకు చేరుకోవాలి. అత్యవసర ఆరోగ్య సమస్యలు, మరేదైనా అత్యవసరాలకు, మరణాలకు సంబంధించిన అంశాలపై డయల్‌ 100కు కాల్ చేయండి. అవసరమైతే ప్రభుత్వమే వాహనం కూడా సమకూరుస్తుంది.అధిక ధరలకు అమ్మితే పీడీ యాక్ట్‌..జైలు

వరి, మొక్కజొన్న రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అండగా ఉంటుంది. సహకార సంఘాల ఆధ్వర్యంలో కొనుగోలు చేస్తాం. దాదాపు యాభై లక్షల ఎకరాల్లో పంట చేతికి రావాల్సిన అవసరముంది. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు అనుమతిస్తున్నాం. అక్కడ కూడా గుంపులు గుంపులుగా కాకుండా దూరం పాటించి కొనసాగించాలని చెబుతున్నాం. చాలా గ్రామాల్లో కంచెలు వేసుకుని నియంత్రణ పాటిస్తున్నారు. హోం క్వారంటైన్లలో ఉన్నవారి పాస్‌పోర్టులు సీజ్‌ చేస్తాం. అప్పటికీ వినని పరిస్థితి వస్తే పాస్‌పోర్టు రద్దు చేసేలా చర్యలు తీసుకుంటాం. క్వారంటైన్లలో ఉన్నవాళ్లు అక్కడే నియంత్రణలో ఉండాలి.అధిక ధరలకు కూరగాయలు అమ్మేవారిపై పీడీ యాక్ట్‌ పెట్టి దుకాణాలు సీజ్‌ చేసి జైలుకు పంపిస్తాం. దీనిపై ఇప్పటికే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం. ప్రపంచమంతా, దేశమంతా అల్లకల్లోలంగా ఉన్న ఈ సమయంలో వ్యాపారులు ఇలా ప్రవర్తిస్తారా? అత్యవసరం మినహా అన్ని రకాల దుకాణాలు సాయంత్రం 6లోపే బంద్‌ చేయాలి. ఆ తర్వాత దుకాణం తెరిచిఉంటే లైసెన్సులు రద్దు చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం. ఎవరికి వారు దీన్ని పాటించాల్సిందే. ఈ ఆపత్కాల సమయంలో ప్రతి ఒక్కరూ కచ్చితంగా నియంత్రణ పాటించాలి. చాలా వరకు టీవీ ఛానళ్లు కూడా దీనిపై అవగాహన కల్పిస్తున్నాయి’’ అని కేసీఆర్‌ చెప్పారు.

అత్యవసరమా.. డయల్‌ 100కి కాల్ చేయండి

‘‘రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ విధించాం. ఒక్కరు కూడా రోడ్డుపైకి రావడానికి వీల్లేదు. అత్యవసరానికి సంబంధించి ఎలాంటి ఇబ్బంది ఉన్నా డయల్‌ 100 చేయండి. ఇంటివద్దకే వాహనం వస్తుంది.. సాయం చేస్తారు. ఏ ఒక్కరైనా వీధుల్లోకి వస్తే మాత్రం కఠిన చర్యలు ఉంటాయి. ఇక బతిమిలాడే పరిస్థితి ఉండదు. ఎవరికి వారు స్వయం నియంత్రణ పాటించాలి. హైదరాబాద్‌, సైబరాబాద్‌, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ప్రజలంతా నియంత్రణ పాటించాలి. భగవంతుని దయతో ఇప్పటికి వ్యాధి మనచేతుల్లోనే ఉంది. స్థానికంగా ఈరోజు ఒక్క కేసూ నమోదు కాలేదు. నమోదైనవి కూడా విదేశాల నుంచి వచ్చిన వారివే. పోర్టులు, రైల్వేలు ఇప్పటికే మూతపడ్డాయి. విమానాలు కూడా ఈరోజు నుంచి మూతపడనున్నాయి.ఇకపై విదేశాల నుంచి ఎవరూ వచ్చే అవకాశం లేదు. ఇప్పటికే రాష్ట్రానికి చేరిన వైరస్‌ వ్యాప్తి కాకుండా చూసుకోవాలి. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు మనవరాలి పెళ్లికి 40వేల ఆహ్వానపత్రికలు పంచారు. ప్రస్తుత పరిస్థితితో దాన్ని వాయిదా వేసుకున్నారు. ఆయన్ను అభినందిస్తున్నా. జిల్లా కలెక్టర్లు, పోలీసుశాఖ, వైద్య ఆరోగ్యశాఖ, మున్సిపల్‌ పరిధిలోని పారిశుద్ధ్యశాఖ అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్యులు అలసట చెందకుండా ఆరోగ్యశాఖ మంత్రి, అధికారులు చర్యలు తీసుకోవాలి. పోలీసులు సైతం అలసట చెందకుండా చూసుకోవాలి. ఉన్న సిబ్బంది షిఫ్ట్‌ల వారీగా ఎలా నడపాలనే దానిపై డీజీపీ చర్యలు తీసుకుంటున్నారు. పదే పదే కోరుతున్నా.. ఈ నాలుగు రోజులు కళ్లు మూసుకుంటే మొత్తం రాష్ట్రాన్ని కాపాడుకున్న వాళ్లమవుతాం’’ అని ప్రజలకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు.చేతులు జోడించి చెబుతున్నా..

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడిక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని.. మూడు కి.మీ పరిధిలోనే కూరగాయలు, నిత్యావసరాలు తీసుకోవాలని సీఎం సూచించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించకుండా వాహనాల్లో రోడ్లపైకి వస్తే పెట్రోల్‌ బంకులు సైతం మూసివేస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశాఖకు ఎట్టి పరిస్థితుల్లోనూ నిధుల కొరత రాకూడదని సీఎస్‌, ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించినట్లు కేసీఆర్‌ తెలిపారు. ఆ శాఖకు ఏం అవసరమున్నా మిగతా శాఖలకు ఆపివేసి అయినా వైద్య ఆరోగ్యశాఖ, పోలీసుశాఖలకు ఇవ్వాలని సూచించామన్నారు. ఎల్లుండి నుంచి తెల్ల రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ ప్రారంభిస్తామని.. ప్రకటించిన నగదు కూడా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం చెప్పారు. మీడియాతో కొందరు పోలీసులు దురుసుగా ప్రవర్తించినట్లు తన దృష్టికి వచ్చిందని.. అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదన్నారు. లాక్‌డౌన్‌ నుంచి మీడియాకు ప్రభుత్వమే మినహాయింపు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ‘‘రెండు చేతులు జోడించి చెబుతున్నా.. ఎవరో మిమ్మల్ని నిర్బంధించడం కాదు.. మనకి మనమే నిర్బంధించుకోవాలి’’ కేసీఆర్‌ వ్యాఖ్యానించారు.

No comments

Powered by Blogger.
close