5 రూపాయలకి🐓కోడి.! రూ.1కే చికెన్ బిర్యానీ..!


కరోనా.! కరోనా..!! ఎక్కడ చూసిన దాని బీభత్సమే. మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. విమానాలు కదలడం లేదు. దేశాల సరిహద్దులను మూసేస్తున్నారు. అంతకుమించి విలువైన మానవ ప్రాణాలు పోతున్నాయి. వైద్య సిబ్బంది క్షణక్షణం భయంతో బతికేస్తున్నారు. ఈ బీభత్సం నడమ కొత్త వింతలు చోటు చేసుకుంటున్నాయి. రూపాయి మాస్కులను 20 రూపాయలకు అమ్మేస్తున్నారు. మొన్నటి వరకు రూ. 180 పలికిన చికెన్ రూ. 80కి దిగొచ్చింది. ఫారమ్ వద్ద అయితే పరిస్థితి మరీ ఘోరం. ఒడిశాలో రెండు కేజీల కోడిని కేవలం రూ. 5కే తెగనమ్మేస్తున్నారు. రెండు కేజీల కోడిని ఉత్పత్తి చేయడానికి రూ. 80 వరకు ఖర్చవుతుంది. చికెన్ మార్కెట్ కుప్పకూలడంతో వాటిని ఇంకా పోషిస్తే మరింత నష్టం వస్తుందని రైతులు వదిలించుకుంటున్నారు.దీంతో హోటల్‌ యజమానులు చికెన్‌ బిర్యానీ కొంటే చికెన్‌-65 ఉచితమంటూ ప్రకటిస్తున్నారు. కరోనా కేసుల పెరుగుతున్న కేరళలో అయితే కోళ్లను ఉచితంగానే ఇస్తున్నారు. భారీ నష్టాలు వస్తున్నాయని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా కోళ్లద్వారా వ్యాపించదని శాస్త్రవేత్తలు, ప్రభుత్వాల అరిచి గీపెడుతున్నా, ప్రాణం కంటే చికెన్ గొప్పది కాదని జనం దూరంగా ఉంటున్నారు. తెగించినోళ్లు లాగించేస్తున్నారు. అలాంటి వారి కోసం:

రూ.1కే చికెన్‌ బిర్యానీ:తమిళనాడులోని తిరువళ్లూర్‌ జిల్లా పొన్నేరిలో కొత్తగా ప్రారంభించిన ఒక హోటల్ లో రూ.1కే చికెన్‌ బిర్యానీ అమ్మటం మొదలెట్టారు హోటల్‌ యజమానులు. ప్రారంభోత్సవ కానుకగా ప్రజలకు రూ.1కే చికెన్‌ బిర్యానీ అందిస్తున్నట్లు బోర్డులు పెట్టడంతో ప్రజల బారులు తీరారు. ప్రజలు బిర్యానీ కోసం బారులు తీరడంతో అక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందో బస్తు ఏర్పాటు చేశారు. తొలిరోజు మధ్యాహ్నం 12గంటలకు విక్రయాలు ప్రారంభించగా రెండు గంటల్లోనే 120 కిలోల చికెన్‌ బిర్యానీ అయిపోయింది. ఈ విషయమై హోటల్‌ యజమాని మాట్లాడుతూ కొత్తగా హోటల్‌ ప్రారంభించామని, కరోనా వైరస్‌ భయంతో చికెన్‌ బిర్యానీ విక్రయమవుతుందా అనే సందేహం కలిగిందన్నారు. దీంతో రూ.1కే అని ప్రకటించిన రెండు గంటల్లోనే బిర్యానీ విక్రయమైందని ఆయన తెలిపారు.

No comments

Powered by Blogger.