భారత్ లో తొలి కరోనా మరణం.! హైదరాబాద్ లో హై అలెర్ట్…
కరోనా వైరస్ తో భారత్‌లో తొలి మరణం నమోదైంది. కర్నాటకలోని కలబుర్గికి చెందిన మహ్మద్ హుస్సేన్ సిద్ధఖీ(76) కోవిడ్ లక్షణాలతో మరణించారు. జనవరి చివరి వారంలో సౌదీ అరేబియాకు వెళ్లిన సిద్ధఖీ ఫిబ్రవరి 29న తిరిగి వచ్చారు. దగ్గు, జలుబు, జ్వరం, శ్వాస సంబంధ సమస్యలతో బాధపడుతుండటంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆయనను 4వ తేదీన గుల్బర్గాలోని ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అయినా జ్వరం తగ్గక పోవడంతో మెరుగైన వైద్యం కోసం ఆయనను అంబులెన్స్‌లో సోమవారం హైదరాబాద్‌కు తీసుకొచ్చారు.
తొలుత జూబ్లిహిల్స్‌లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి, ఆ తర్వాత బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న మరో కార్పొరేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అడ్మిట్ చేసుకోకపోవడంతో చివరకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ ఒకటిలో ఉన్న మరో కార్పొరేట్ ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. వైద్యులు అప్పటికే బాధితుడికి కరోనా సోకినట్లు అనుమానించారు. గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తీసుకెళ్లాల్సిందిగా సూచించారు. బంధువులు ఆయన్ను గాంధీకి తీసుకెళ్లకుండా ఓ ప్రైవేటు అంబులెన్స్‌లో మంగళవారం మళ్లీ గుల్బార్గకు తీసుకెళ్లారు.
మంగళవారం గుల్చార్గా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వైద్యులు బాధితుని నుంచి నమూనాలు సేకరించి, బెంగళూర్‌లోని వైరాలజీ ల్యాబ్‌కు పంపింది. బాధితుడు బుధవారం సాయంత్రం మృతి చెందాడు. బాధితుడికి సంబంధించిన రిపోర్ట్లు గురువారం సాయంత్రం వచ్చాయి. ఆ మెడికల్ రిపోర్ట్ల్లో అతడికి కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది.
హైదరాబాద్ అలర్ట్:
కోవిడ్–19తో మృతి చెందిన వ్యక్తి హైదరాబాద్‌లో చికిత్స పొందిన నేపథ్యంలో హైదరాబాద్ సహా తెలంగాణాలో ఆందోళన నెలకొంది. ఆయనకు చికిత్స అందించిన బంజారాహిల్స్, జూబ్లిహిల్స్‌లోని మూడు కార్పొరేట్ ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందిలో ఆందోళన నెలకొనడంతో తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. ఆయా ఆస్పత్రుల్లోని వైద్య సిబ్బందికి వ్యాధినిర్ధారణ పరీక్షలకు ఆదేశించింది.
Post a Comment