జనతా కర్ఫ్యూని మించి, భారత్ లాక్ డౌన్.! ఈ అర్ధరాత్రి నుంచి ఢిల్లీ నుంచి గల్లీ వరకు …
కరోనా మహమ్మారిని కట్టడి చేయడం కోసం ప్రధాని నరేంద్రమోడీ మరింత కఠిన నిర్ణయం తీసుకున్నారు. జనతా కర్ఫ్యూని మించి కఠినమైన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ అర్ధరాత్రి నుంచి 21 రోజుల పాటు దేశవ్యాప్త లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఒక్కరూ దీన్ని అనుసరించాల్సిందేనని ఆదేశించారు. ఇది ప్రజారోగ్యానికి సంబంధించిన విషయమని, ఇందులో ఎలాంటి రాజీ వుండబోదని స్పష్టం చేశారు.
లాక్ డౌన్ వల్ల ఆర్ధిక వ్యవస్థ దెబ్బతినే అవకాశం వున్నప్పటికీ, ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం తప్పని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఏ ఒక్క పౌరుడూ ఇంటి గడప దాటి బైటికి రావొద్దని సూచించారు. జనతాకర్ఫ్యూకు మించి లాక్డౌన్ అమలు చేయనున్నట్లు ప్రకటించారు. కలిసికట్టుగా కరోనాను ఎదుర్కోవాల్సిన సమయమిదేనని, దీనికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. జాతినుద్దేశించి ప్రధాని ప్రసంగించారు.
21 రోజులు అప్రమత్తంగా వుండండి:
కరోనా వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న 21 రోజులు చాలా కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మార్చి 22న ప్రజలంతా జనతా కర్ఫ్యూను విజయవంతం చేశారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. అలాగే మరో మూడు వారాలు జనతా కర్ఫ్యూలో భాగం కావాలని పిలుపునిచ్చారు. కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు 21 రోజులు కావాలని నిపుణులు చెబుతున్నారన్నారు. ఈ 21 రోజులు జాగ్రత్తలు తీసుకోకపోతే తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదన్నారు. కొన్నాళ్ల పాటు ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన మానుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ 21 రోజులు జాగ్రత్తగా ఉందాం.. దేశాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.
Post a Comment