వరంగల్: తండ్రి కడసారి చూపునకు కరోనా అడ్డంకి…
మండలంలోని ముల్కనూర్‌లో గుండెపోటుతో పెద్ది రాజిరెడ్డి (55) అనే ఆర్ఎంపీ వైద్యుడు మంగళవారం ఉదయం మృతి చెందాడు. మండలంలోని కొప్పుర్ గ్రామానికి చెందిన రాజిరెడ్డి ముల్కనూర్‌లో ఆర్ఎంపీ వైద్యుడిగా స్థిరపడ్డాడు. రాజిరెడ్డి మంగళవారం ఉదయం తన ఇంటి ముందు స్పృహ తప్పి పడిపోయాడు.
వెంటనే కుటుంబ సభ్యులు ఆటోలో ఆస్పత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే మృతి చెందాడు. రాజిరెడ్డి కుమారుడు నితీష్ రెడ్డి ఎంటెక్ చదవి అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కూతురు నిఖిల దంత వైద్యురాలిగా వరంగల్‌లో పనిచేస్తోంది. అయితే రాజిరెడ్డి మరణవార్తను అమెరికాలో ఉంటున్న కుమారుడు నితీష్ రెడ్డికి చేరవేశారు. ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా వైరస్ గడగడలాడిస్తుండగా అమెరికా నుంచి నితీష్ రెడ్డి ముల్కనూర్‌కు ఎలా వస్తాడోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
విమానంలో అమెరికా నుంచి దుబాయి, ముంబయి, హైదరాబాద్‌కు నితీష్ రెడ్డి చేరుకోవాల్సి ఉంటుందని కుటుంబసభ్యులు పేర్కొంటున్నారు. అయితే మరో 48గంటలు గడిస్తేకానీ నితీష్ రెడ్డి ముల్కనూర్‌కు వచ్చే విషయంపై స్పష్టత వస్తుందని వారంటున్నారు. కుమారుడు వచ్చి రాజిరెడ్డికి అంత్యక్రియలు నిర్వహించే వరకూ మృతదేహాన్ని అలాగే ఉంచుతామని కుటుంబ సభ్యులంటున్నారు. రాజిరెడ్డి మృతదేహాన్ని ఫ్రీజర్‌బాక్స్‌లో భద్రపరిచారు.
Post a Comment