సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా...
మధ్యప్రదేశ్‌లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయిన జ్యోతిరాదిత్య సింధియా ప్రభుత్వానికి గట్టి షాకిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి ఆయన రాజీనామా చేశారు. ఈ ఉదయం మోదీని కలిసిన అనంతరం సింధియా తన రాజీనామా లేఖను ట్విటర్లో పోస్ట్ చేశారు. కమల్‌నాథ్ ప్రభుత్వంపై అసంతృప్తిగా ఉన్న సింధియా తన, వర్గం ఎమ్మెల్యేలతో కలిసి బెంగళూరు వెళ్లడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఈ నేపథ్యంలో సింధియా నేడు ప్రధానిని కలవడంతో రాష్ట్రంలో కమల్‌నాథ్ సర్కార్ మనుగడ ప్రమాదంలో పడింది.
ఈ ఉదయం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి సింధియా ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. అనంతరం కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తూ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ పంపారు. ఈ విషయాన్ని ట్విటర్ వేదికగా వెల్లడిస్తూ.. రాజీనామా లేఖను పోస్ట్ చేశారు. మరికొద్ది సేపట్లో ఆయన భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో ఆ పార్టీలో చేరనున్నట్లు సమాచారం.
‘గత 18ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీతో ఉన్నా.
ఇక వెళ్లిపోవాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా కాంగ్రెస్‌తో కలిసి ఉంటే రాష్ట్ర, దేశ ప్రజలకు సేవల చేయలేనేమో అని అనిపిస్తోంది. నా ప్రజలు, నా కార్యకర్తల ఆశల కోసం కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడమే ఉత్తమమని భావిస్తున్నా. ఇన్నాళ్లు ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించిన పార్టీకి, సహ నేతలకు కృతజ్ఞతలు’ అని సింధియా లేఖలో పేర్కొన్నారు. అటు మధ్యప్రదేశ్‌లోనూ సింధియా వర్గానికి చెందిన 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి మద్దతు విరమించుకునేందుకు సిద్ధమయ్యారు. అదే జరిగితే అసెంబ్లీలో కాంగ్రెస్ సంఖ్యాబలం తగ్గి కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోయే ప్రమాదం ఉంది.
Post a Comment