వాట్సాప్, ఫేస్-బుక్, ట్విటర్ అకౌంట్లతో ఆధార్ కార్డు లింకు అవసరం లేదు: కేంద్రం


సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు వివరాలను అనుసంధానం చేయడానికి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందంటూ కొద్దిరోజులుగా వార్తలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై దాఖలైన పిటీషన్లపై విచారణ నిర్వహిస్తోన్న దేశ అత్యున్నత న్యాయస్థానానికి సానుకూలంగా తన నిర్ణయాన్ని తెలియజేసిందంటూ అవే సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో వాటిపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు వివరాలను లింకేజీ చేయాలనే ఆలోచన ఏదీ లేదని వెల్లడించింది.


ఈ మేరకు కేంద్ర ఐటీ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ బుధవారం లోక్ సభలో దీనిపై వివరణ ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ సహా ఇతర సోషల్ మీడియా ప్లాట్ ఫాంలపై తమ అకౌంట్లను కలిగి ఉన్న వ్యక్తుల ఆధార్ కార్డు వివరాలను అనుసంధానించే యోచన ఏదీ లేదని రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూరకంగా సమాధానం ఇచ్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సప్ లతో పాటు దాదాపు అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫాంలల్లో నకిలీ అకౌంట్లు కుప్పలు తెప్పలుగా పుట్టుకొస్తున్న నేపథ్యంలో.. వాటిని కట్టడి చేయడానికి ఆధార్ కార్డు వివరాలతో వాటిని అనుసంధానించేలా చర్యలు చేపట్టాలని సూచిస్తూ సుప్రీంకోర్టు సహా దేశంలోని వివిధ రాష్ట్రాల హైకోర్టుల్లో వేర్వేరుగా పదుల సంఖ్యలో పిటీషన్లు దాఖలయ్యాయి. వాటిన్నింటినీ క్రోడీకరించి సుప్రీంకోర్టు విచారణ నిర్వహిస్తోంది.


సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు లింకేజీపై తన నిర్ణయాన్ని వెల్లడించాలని కోరుతూ సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులను సైతం జారీ చేసింది. దీనిపై ఇదివరకే సొలిసిటర్ జనరల్ ఓ కౌంటర్ అఫిడవిట్ ను సుప్రీంకోర్టుకు సమర్పించారు. ఇదే విషయంపై లోక్ సభలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియా అకౌంట్లతో ఆధార్ కార్డు వివరాలను లింక్ చేయాలనే యోచన లేదని, ఆ దిశగా ఎలాంటి నిర్ణయాన్ని కూడా ఇప్పటికిప్పుడు తీసుకోబోమని ఆయన లిఖితపూరకంగా సమాధానం ఇచ్చారు.


ఈ విషయంపై కొంత చర్చ జరగాల్సి ఉందని, దాని తరువాత నిర్ణయాన్ని తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన పలు కేసులు సుప్రీంకోర్టులో విచారణ దశలో ఉన్నాయని చెప్పారు. ఆధార్ లింకేజీలపై దేశవ్యాప్తంగా పలు హైకోర్టుల్లో పిటీషన్లు దాఖలయ్యాయని, వాటన్నింటినీ తాము సుప్రీంకోర్టుకు బదలాయించినట్లు తెలిపారు. అవన్నీ ఒకే రకమైన కేసులు కావడం వల్ల వేర్వేరుగా హైకోర్టులు తమ తీర్పును వెల్లడించడానికి బదులుగా.. వాటన్నింటినీ సమీకృతం చేసి, ఒకే తీర్పును సుప్రీంకోర్టు వెలువరిస్తుందని అన్నారు.

No comments

Powered by Blogger.
close