నిజాముద్దీన్‌ కలవరం !


18న ఢిల్లీలో మసీదు కార్యక్రమానికి 500 మంది హాజరున్యూఢిల్లీ : ఈనెల 18న దేశ రాజధాని ఢిల్లీలోని నిజాముద్దీన్‌ ప్రాంతంలో ఉన్న ‘మర్కాజ్‌’ మసీదులో జరిగిన ఓ మత సంబంధిత కార్యక్రమానికి హాజరైన వివిధ రాష్ట్రాల వారికి కరోనా పాజిటివ్‌ ఉన్నట్లు తేలడంతో తీవ్ర భయాందోళన వ్యక్తమవుతోంది. నిజాముద్దీన్‌ ఏరియాలోని దాదాపు 200 మందిని కరోనా పరీక్షల నిమిత్తం నగరంలోని పలు ఆసుపత్రులకు తరలించామని, రెండువేల మందికి క్వారంటైన్‌ విధించామని ఢిల్లీ అధికారులు సోమవారం తెలిపారు. ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకొని డ్రోన్‌ కెమెరాల సాయంతో జనాల కదలికలు లేకుండా లాక్‌డౌన్‌ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నారు.మసీదులో జరిగిన ఈ కార్యక్రమానికి మలేషియా, ఇండోనేషియా, సౌదీ అరేబియాల నుంచి, పలు రాష్ట్రాల నుంచి 500 మందికి పైగా హాజరై, తిరిగి సొంత ప్రాంతాలకు చేరుకున్నారని అధికారిక వర్గాల సమాచారం. అండమాన్‌ నికోబార్‌ దీవుల్లో ఆరుగురికి కరోనా సోకినట్లు శుక్రవారం తేలిందని, వీరంతా ఢిల్లీ కారక్రమానికి వెళ్లి 24వ తేదీన కోల్‌కతా మీదుగా పోర్ట్‌బ్లెయిర్‌ చేరుకున్నారని సీనియర్‌ అధికారి ఒకరు చెప్పారు.ఈ కార్యక్రమానికి హాజరై రైలులో వచ్చిన జమ్ముకాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో గురువారం 65 ఏళ్ల వ్యక్తి కరోనాతో మరణించారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన 52 ఏళ్ల వ్యక్తికి పాజిటివ్‌ వచ్చింది. తమిళనాడులో ఇటీవల మృతిచెందిన ఒకరు కూడా ఈ కార్యక్రమానికి వెళ్లి వచ్చినట్లు తేలింది. తమిళనాడులో సోమవారం నిర్ధారణ అయిన కేసుల్లో నిజాముద్దీన్‌ కార్యక్రమా నికి వెళ్లి వచ్చిన కులితలై ప్రాంతానికి చెందిన వ్యక్తి ఉన్నారు.

29 మరణాలు, 1071 కేసులు :

సోమవారం నాటికి భారత్‌లో ఈ వైరస్‌ భారిన పడిన వారి సంఖ్య 1071కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీరిలో 29 మంది మరణించగా, 942 మంది పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారని ప్రకటించింది. మరో వంద మంది కరోనా నుంచి కోలుకున్నారని తెలిపింది. మహారాష్ట్ర, కేరళలో ఈ వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. పూణెలో తొలి మరణం సంభవించింది. దీంతో మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 9కు చేరింది. సోమవారం కర్నాటకలో 5, రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 6, జమ్ములో 3, తమిళనాడులో 17, ఇంకా పలు రాష్ట్రాల్లో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఉత్తరాఖండ్‌లో జిల్లాల సరిహద్దులను రాష్ట్ర ప్రభుత్వం మూసివేయించింది.

No comments

Powered by Blogger.