లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నాం: జి.కిషన్ రెడ్డి..


కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. న్యూఢిల్లీలో, మంత్రి మీడియా ప్రతి నిధులతో మాట్లాడుతూ, వివిధ రాష్ట్రాలు, నిపుణులు దీనికి సంబంధించిన సూచనలు చేస్తున్నారని, తెలిపారు.‘‘ప్రజలు లాక్‌డౌన్‌కు సహకరించాలని చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దు.


అనవసర కారణాలతో రోడ్డపై తిరగొద్దు. ప్రతిరోజు తాజా కూరగాయల కోసం ప్రజలు ఇళ్లనుండి బయటకు రావద్దు, వారానికి సరిపడా కూరగాయలు, నిత్యావసర వస్తువులను ఒకేసారి తెచ్చుకోవాలని” కిషన్ రెడ్డి అన్నారు. “ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకునే, కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది, ప్రభుత్వ అవసరాల కోసం కాదు. విదేశాల నుండి వచ్చి ఢిల్లీ లో క్వారైంటైన్ పూర్తి చేసుకున్నవారిని ప్రస్తుత పరిస్థితులలో వారి స్వస్థలాలకు తరలించడం సాధ్యం కాదు.


వారికి క్వారైంటైన్ సెంటర్ లోనే లాక్ డౌన్ కొనసాగినన్ని రోజులు ఆహారం, వసతి సదుపాయాలు అందిస్తాం. వారి తల్లితండ్రులు ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలి. వారి క్షేమం పట్ల ఆందోళన చెందవద్దు, అని కిషన్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ పొడగింపుపై అందరి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు స్వీకరించిన తరువాత ప్రధాని నిర్ణయం తీసుకుంటారు. “దేశంలో టెస్టింగ్‌ కిట్ల కొరతలేదు. ఈరోజు రెండు లక్షల కిట్లు వచ్చాయి. ఆరేళ్లుగా కేంద్రం ఒక్క రూపాయికూడా దుర్వినియోగం చెయ్యలేదు. ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాం’’ అని మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. నిన్న జరిగిన మంత్రుల బృందం సమావేశంలో లాక్ డౌన ను మరింత కఠినంగా అమలు చేయాలని నిర్ణయించాం. లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించే ప్రసక్తి లేదు, అని మంత్రి స్పష్టం చేశారు.

No comments

Powered by Blogger.