ఇన్సూరెన్స్ చేయిస్తాడు.! హతమార్చి క్లెయిమ్ చెసుకుంటాడు, ఇలా దొరికిపోయాడు…
అతడి టార్గెట్ డబ్బు.! తాను ఎంచుకున్న వ్యక్తుల పేరిట ఇన్సూరెన్స్ చేయిస్తాడు. వారి భార్యలకు విషయం చెప్పేస్తాడు.! తన ముఠాతో కలిసి టార్గెట్లను హతమార్చి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరిస్తాడు.! క్లెయిమ్‌ల ద్వారా వచ్చిన డబ్బులో సింహభాగం నొక్కేస్తాడు.! ఇలా బీమా దారుణాలకు పాల్పడుతున్న ఓ ఘరానా నేరగాడు, అతడి ముఠా ఆటను నల్లగొండ పోలీసులు కట్టించారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నల్లగొండ ఎస్పీ/డీఐజీ ఏవీ రంగనాథ్ వివరాలు వెల్లడించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం రాళ్లవాగు తండాకు చెందిన ధీరావత్ రాజు గతంలో నల్లగొండలోని ఓ ఫైనాన్స్ సంస్థలో ఏజెంట్‌గా పని చేశాడు. జీవిత బీమా క్లెయిమ్‌లు ఏవిధంగా పొందాలనేదానిపై పట్టు సాధించాడు. తప్పుడు బీమా క్లెయిమ్‌లతో డబ్బు సంపాదించడం ప్రారంభించాడు. అలా పదేళ్ల క్రితం పాలకవీడు మండలం శూన్యపహాడ్ తండాకు చెందిన సక్రియా ఆత్మహత్య చేసుకోగా రూ. 14 లక్షలకు ఇన్సూరెన్స్ చేయించి, ఆ తర్వాత ప్రమాదంలో చనిపోయినట్లు పత్రాలు సృష్టించాడు. వచ్చిన క్లెయిమ్‌లో రూ.30 వేలు సక్రియా భార్యకు ఇచ్చి, మిగతాది నొక్కేశాడు. ఇలా 2013-17 కాలంలో తప్పుడు క్లెయిమ్‌లు చేయించిన రాజు ఆ తర్వాత టార్గెట్లను చంపడం ప్రారంభించాడు.
హత్యల వివరాలివి:
- 2013లో మిర్యాలగూడ మండలం జటావత్ తండాలో రూపావత్ దేవా పేరిట రూ.10లక్షల పాలసీ చేయించాడు. అతణ్ని హతమార్చి, ప్రమాదంగా చిత్రీకరించాడు. రూ. 10 లక్షల క్లెయిమ్‌లో రూ.4 లక్షలను అతడి భార్యకు ఇచ్చి, మిగతాది తాను తీసుకున్నాడు.
- 2015లో దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామానికి చెందిన పరంగి సోమయ్య పేరుతో మూడు వేర్వేరు బీమా సంస్థల్లో రూ. 14 లక్షలకు పాలసీలు వేయించాడు. లావూరి మంగూ అనే వ్యక్తితో కలిసి అతణ్ని ఇలాగే చంపేశాడు. వచ్చిన మొత్తంలో సోమయ్య భార్యకు రూ. 3 లక్షలు ఇచ్చాడు.
- 2014లో మిర్యాలగూడ మండలం కల్లెపల్లి గ్రామానికి చెందిన ధీరావత్ లాల్సింగ్ను కూడా ఇలాగే మంగూ, చంటీ, ఎర్రానాయక్ అనే వ్యక్తులతో కలిసి కడతేర్చాడు. రూ. 18 లక్షల క్లెయిమ్‌లో రూ. 4 లక్షలను లాలాసింగ్ భార్యకు ఇచ్చాడు.
- 2016లో కొండ్రపోల్‌కు చెందిన దైద హుస్సేన్ పేరిట రూ. 53 లక్షల పాలసీ చేయించి అతణ్ని చంపి రోడ్డు ప్రమాద క్లెయిమ్ చేశాడు. కొంత మొత్తాన్ని హుస్సేన్ కుటుంబ సభ్యులకు ఇచ్చాడు.
- 2017లో మిర్యాలగూడ మండలం రాళ్లవాగు తండాకు చెందిన తుల్యా పేరిట రూ. 60లక్షలకు బీమా చేయించాడు. అతను సాధారణంగా చనిపోతే.. ప్రమాదంగా చిత్రీకరించి, బీమా క్లెయిమ్ చేయించాడు.
- గుంటూరు జిల్లా తెనాలిలో ఉన్న రాజు తన బంధువు రమావత్ కన్నా అనారోగ్యంతో చనిపోగా.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించబోయి అరెస్టయ్యాడు. ఇదే జిల్లా దాచేపల్లి మండలం బట్రుపాలెంకు చెందిన భూక్యా నాగులు, కొండ్రపోల్‌కు చెందిన పొదిళ్ల వెంకన్న, బొల్లిగుట్టకు చెందిన జైత పేరుతో బీమా చేయించి క్లెయిమ్‌లో విఫలమయ్యాడు.
Post a Comment